స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తన వినియోగదారులకు ఊరటనిచ్చే వార్త చెప్పింది. కేవైసీ కోసం బ్యాంక్ దాకా వెళ్లాల్సిన పనిలేదని తెలియజేసింది. ఖాతాదారులు కేవైసీ పూర్తి చేసేందుకు సంబంధిత పత్రాలను రిజిస్టర్డ్ పోస్ట్ లేదా ఈ-మెయిల్ ద్వారా పంపినా చాలని తెలిపింది. ఈ క్రమంలో ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం ఎంతో మంది ఖాతాదారులకు ఊరట కలిగించనుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలోనే కస్టమర్లకు చెందిన కేవైసీని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలని బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సూచించింది. దీంతో ఆయా సంస్థలు ఎప్పటికప్పుడు తన ఖాతాదారులకు చెందిన కేవైసీ వివరాలను అప్ డేట్ చేస్తున్నాయి. అయితే కోవిడ్ కారణంగా గతేడాది నుంచి ఆర్‌బీఐ వీడియో కేవైసీకి అనుమతులు ఇచ్చింది. దీంతో కస్టమర్లు కొత్త ఖాతాలను తెరిచినా, ఇప్పటికే ఉన్న ఖాతాలకు అయినా సరే వీడియో కాల్ ద్వారానే కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తున్నారు.
అయితే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయని ఖాతాదారుల అకౌంట్లను ఎస్‌బీఐ హోల్డ్‌లో ఉంచింది. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం ఎస్‌బీఐ ఇందుకు మే 31వ తేదీ వరకు గడువు ఇచ్చింది. అంటే ఆలోగా ఎస్‌బీఐ కస్టమర్లు ఈ-మెయిల్ లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా కేవైసీ పత్రాలను పంపి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. అప్పటి వరకు అకౌంట్లను ఫ్రీజ్ చేయరు. కోవిడ్ నేపథ్యంలోనే ఖాతాదారుల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్‌బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఇక కేవైసీ ప్రక్రియ కోసం ఖాతాదారులు పాస్‌పోర్టు, వోటర్ ఐడీ, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ కార్డు, ఎన్ఆర్ఈజీఏ కార్డు, పాన్ కార్డులలో ఏదైనా పత్రాన్ని సమర్పించవచ్చు.