దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు ప్రతి ఒక్కరిని ఎంతో భయాందోళనకు గురి చేస్తున్నాయి.రోజురోజుకు కేసుల సంఖ్య తీవ్రం కావడంతో ఆస్పత్రిలో సరైన సదుపాయాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడటంతో పాటు పడకల కొరత ఏర్పడటంతో ఎంతోమందికి సరైన సమయంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు.
ఈ క్రమంలోనే ప్రైవేటు ఆసుపత్రిలో సైతం కరోనా రోగులను ఆసుపత్రిలో చేర్చుకోవడానికి చేతులెత్తిస్తున్నాయి. కరోనా తీవ్రత వల్ల దేశంలో ఎంతటి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడ్డాయో తెలిపేందుకే ఈ సంఘటన ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన రేణు సింఘాల్ భర్త రవి సింఘాల్ గత కొద్ది రోజులుగా కరోనా వైరస్ బారిన పడ్డాడు.
కరోనాతో ఎంతో ఇబ్బందిపడుతున్న రవి ఆరోగ్యం విషమించడంతో చికిత్స నిమిత్తం అతనిభార్య ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్ళింది. ఆస్పత్రికి వెళ్లే సమయంలో ఊపిరి పీల్చుకో లేక ఇబ్బంది పడుతున్న అతడికి ఆమె నోటితోనే శ్వాస అందించి తన భర్త ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆస్పత్రి చేరేలోగా అతడు ఆమె ఒడిలోనే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతో మందిని కలిచి వేసింది.