తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో విద్యార్థుల పట్ల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పది పరీక్షలను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా 1-9 తరగతుల విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు లేకుండా వారిని పాస్ చేస్తూ పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం ఉదయం తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి,విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ ఆదేశాలను జారీ చేసినట్లు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ ఏడాది పరీక్షలు లేకుండా 1నుంచి 9వ తరగతి చదువుతున్న 53 లక్షల 79 వేల 388 మంది విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలలు జూనియర్ కళాశాలలో ఎప్పుడు తెరిచేది అనే విషయం గురించి కరోనా పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని జూన్ 1వ తేదీన ప్రభుత్వం నిర్ణయిస్తుందని మంత్రి తెలిపారు. ఈ ఏడాదికి ఏప్రిల్ 26న విద్యా సంవత్సరం చివరి దినంగా ప్రకటిస్తూ ఏప్రిల్ 26 నుంచి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.