భయం ఎంతో ధైర్యవంతులని కూడా కృంగదీస్తుంది. భయం ప్రాణాలను కూడా తీస్తుంది. అటువంటి భయమే 30 ఏళ్ల యువకుడు ప్రాణాలను బలిగొంది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్లం గ్రామానికి చెందిన 30 ఏళ్ల యువకుడు అశోక్ వృత్తి రీత్యా ఆటో డ్రైవర్ గా పని చేసేవాడు.అయితే గత కొద్దిరోజుల నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్న అశోక్ అతనికి కరోనా వచ్చిందేమోనని భయపడ్డాడు.దీంతో తల్లి గంగామని, భార్య లక్ష్మి, తమ్ముడు గంగాధర్ తో కలిసి రెంజల్ పీహెచ్సీకి వచ్చి పరీక్ష చేయించుకున్నాడు.
పరీక్షల అనంతరం ఆస్పత్రి ఆవరణలో చెట్టు కింద సేద తీరుతున్నారు. ఈ క్రమంలోనే అశోక్ తనకెంతో నీరసంగా ఉందని తన తల్లితో చెప్పడంతో తన తల్లి అతనికి ఏం కాదు ధైర్యంగా ఉండు అంటూ ధైర్యం నూరిపోసింది. ఇంతలోనే అశోక్ ఉన్నఫలంగా తన తల్లి గంగామణి వడిలో కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఒక్కసారిగా తన కొడుకు ప్రాణాలు వదలడంతో ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం. మృతుడికి భార్య కొడుకు ఉన్నారు.
ఈ సంఘటన జరిగిన కొద్ది సమయానికి ఆసుపత్రి సిబ్బంది తనకు కరోనా నెగిటివ్ అనే వార్త తెలియజేశారు. ఈ విషయం తెలిసి మృతుడి భార్య, తల్లి మరింత ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కరోనా పట్ల ఉన్న భయం, అపోహలు కారణంగానే ఈ విధమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయని. ఇకపై ఈ వ్యాధి పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని వైద్యులు సూచిస్తున్నారు.