ప్రతి నెల వచ్చే పౌర్ణమి, అమావాస్యలకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. అయితే కొత్త సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి పౌర్ణమి చైత్ర పౌర్ణమిగా పిలుస్తారు. ఈ చైత్ర పౌర్ణమి సోమవారం (ఏప్రిల్ 26) న వస్తుంది. ఈ పౌర్ణమి రోజు కొన్ని ప్రత్యేక పూజలు చేయటం వల్ల సకలసంపదలతో సంతోషంగా ఉంటారని పండితులు చెబుతున్నారు.
చైత్ర పౌర్ణమి రోజు చంద్రుడు పూర్ణ బింబంగా కనిపిస్తూ భూమికి ఎంతో దగ్గరగా ఉంటాడు. చైత్ర పౌర్ణమి రోజు శివకేశవులను పూజించటం వల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి అదేవిధంగా ఎవరికైతే సూర్య, చంద్ర గ్రహ దోషాలు ఉంటాయో ఆ దోషాలు సైతం తొలగిపోతాయి.
ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు సత్యనారాయణ వ్రతం ఆచరించడం వల్ల సకల సంపదలు కలుగుతాయి. సత్యనారాయణ వ్రతం ఆచరించి స్వామివారికి కేసరి, అటుకుల పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం మనపై ఉంటుంది. అదే విధంగా ఈ చైత్ర పౌర్ణమి రోజు చిత్రగుప్తుడి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయటం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి. అలాగే శివకేశవులను అష్టోత్తరాలతో స్తుతించడం మంచిది. అన్నదానం చేయడం ద్వారా విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.