చెన్నైలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 టోర్నీ 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది. నువ్వా నేనా అన్నట్లుగా సాగిన ఈ మ్యాచ్ చివరకు సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ క్రమంలో సూపర్ ఓవర్‌లో హైదరాబాద్ నిర్దేశించిన లక్ష్యాన్ని ఢిల్లీ కష్టపడి ఛేదించింది. హైదరాబాద్‌పై ఢిల్లీ సూపర్ ఓవర్‌లో గెలుపొందింది.
మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో పృథ్వి షా, రిషబ్ పంత్‌లు రాణించారు. 39 బంతులు ఆడిన షా 7 ఫోర్లు, 1 సిక్సర్‌తో 53 పరుగులు చేయగా, 27 బంతుల్లో పంత్ 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 37 పరుగులు చేశాడు. హైదరాబాద్ బౌలర్లలో సిద్ధార్థ్ కౌల్ 2 వికెట్లు తీయగా, రషీద్ ఖాన్‌కు 1 వికెట్ దక్కింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కేన్ విలియమ్సన్, జానీ బెయిర్‌స్టోలు రాణించారు. 51 బంతుల్లో విలియమ్సన్ 8 ఫోర్లతో 66 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, 18 బంతుల్లో బెయిర్‌స్టో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. ఢిల్లీ బౌలర్లలో అవేష్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టగా, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశాడు. అమిత్ మిశ్రాకు 1 వికెట్ దక్కింది.