దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతోంది. మొదట్లో వ్యాక్సిన్ వేసుకోవడానికి ప్రజలు వెనకడుగు వేసిన ప్రస్తుతం తీసుకోవడానికి ఆసక్తి చూపడంతో కొరత ఏర్పడింది. ఈ క్రమంలోనే కొందరు మొదటి డోస్ వేయించుకొని రెండవ డోసు అందుబాటులో లేకపోవడం వల్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా మరికొందరు నిర్లక్ష్యం వల్ల రెండవ డోసు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు.ఈ విధంగా ఒక డోస్ తీసుకుని రెండవ డోసు తీసుకోకపోతే ఏం జరుగుతుంది? ఒక డోస్ తీసుకోవటం వల్ల ఏవైనా ప్రమాదాలు తలెత్తుతాయా అనే సందేహం చాలా మందిలో కలుగుతున్నాయి.
అయితే ప్రస్తుతం మనదేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అభివృద్ధి చేస్తోన్న కోవిషీల్డ్,భారత్ బయోటెక్ తయారుచేసిన కోవాగ్జిన్ వ్యాక్సిన్లను ప్రజలకు అందిస్తున్నారు. ఈ రెండింటిలో కోవిషీల్డ్ అధిక సామర్థ్యంతో పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ లు మొదటి డోసు వేయించుకున్న తరువాత తప్పనిసరిగా నాలుగవ వారం నుంచి 12 వారాల వ్యవధిలో రెండవ డోసు తప్పనిసరిగా తీసుకోవాలి.
మొదటి డోసు వేసుకొని రెండవ డోస్ మిస్సయితే మీరు వైరస్ నుంచి రక్షించబడలేరని.. వైరాలజిస్ట్ డాక్టర్ జాకబ్ జాన్ చెప్పారు.రెండవ డోసు వేసుకోకపోతే మీరు వ్యాధి బారిన పడటమేకాకుండా వ్యాధి తీవ్రత అధికంగా అవుతుందని డాక్టర్ జాకబ్ జాన్ తెలిపారు. రెండు డోసులు వ్యాక్సిన్ పూర్తి మోతాదులో తీసుకున్నప్పుడే ప్రయోజనం ఉంటుందని.మొదటి డోసు ఇన్ఫెక్షన్ రేటు తగ్గించిన రెండవ డోసు 90% వైరస్ సంక్రమించకుండా రక్షిస్తుందని డాక్టర్ జాన్ తెలిపారు. కనుక రెండవ డోసు నిర్దిష్ట సమయం కన్నా ఎక్కువైనా తప్పకుండా వేయించుకోవాలని సూచించారు.