ప్రస్తుత కాలంలో తమకు ఆడబిడ్డ జన్మించింది అని తెలిస్తే ఎంతోమంది తల్లిదండ్రులు చాలా బాధపడుతుంటారు. మరికొంత మంది ఆడ పిల్ల అని తెలియగానే వారిని కడుపులోనే చిదిమేస్తున్నారు. మరికొందరు చెత్తకుప్పలు ముళ్ళకంపలో పడేస్తున్న ఘటనలను మనం ఎన్నో చూసాం. కానీ ఇప్పటి కాలంలో కూడా ఆడపిల్ల పుట్టిందంటే కొందరు తమ ఇంటికి మహాలక్ష్మి పుట్టింది అని భావించి ఎంతో సంబరపడిపోతూ ఉంటారు. ఈ రెండవ కోవకు చెందిన వారే రాజస్థాన్ కి చెందిన రైతు మదన్ లాల్ కుమ్హార్.
రాజస్థాన్ లోని నాగౌర్ జిల్లా నింబ్డీ చందావతా గ్రామానికి చెందిన రైతు మదన్ లాల్ కుమ్హార్ కుమారుడికి కూతురు పుట్టింది.గత 35 సంవత్సరాల నుంచి తమ వంశంలో ఒక ఆడ బిడ్డ కూడా లేకపోవడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమకు మనవరాలు పుట్టిందనే విషయాన్ని ఊరంతా ఎంతో సంతోషంగా చెప్పుకున్నారు.
35 సంవత్సరాల తర్వాత తమ ఇంటి ఆడబిడ్డ తన ఇంటిలో అడుగు పెడుతున్న ఆ సమయంలో తనకు ఎంతో ఘన స్వాగతం పలకాలని భావించాడు.ఈ క్రమంలోనే జిల్లా కలెక్టర్ తో అనుమతి తీసుకొని తన కోడలి గ్రామంలోనూ తన గ్రామంలోనూ హెలిపాడ్ ఏర్పాటు చేయించాడు. అనంతరం తన కోడలి ఇంటి నుంచి తన ఇంటికి హెలికాప్టర్ లో తీసుకు వచ్చాడు. దీనికి గాను బిడ్డ తండ్రి హనుమాన్ రామ్ ప్రతాప్ 4.5 లక్షలు ఖర్చు చేశాడు.ఈ విధంగా తన కూతురిని ఎంతో గర్వంగా ఇంటికి తీసుకురావడంతో అందరూ కలిసి ఆ చిన్నారికి పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.